BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

సృజన అనువదించిన ఒక కవిత ఇక్కడ చూడండి.



ప్రకృతిలోని సొగసులు
నీ నడకలోని హొయలు
ఆటలాడి వంటరినై ఉన్న
తుంటరిని చేశాయి

వంటరినై ఉన్న నన్ను
మీ ఇద్దరి అందం చూసిన క్షణం
పాడ మంది యుగళ గీతం
ఇప్పుడే ఒక్కటై జంటగా
నవ్వానిక నేను కొంటెగా

ఈ కవితకి స్పూర్తి అయిన ఆంగ్ల కవిత ఇదిగో...

The spring in your steps
And the spring in nature
Playing a match
That let me have a catch
Of a bit of happiness
In all my loneliness

In all my loneliness
This weather makes me
Light as a feather
Dreaming us together

ఏదో చిన్న ప్రయత్నమే తప్ప పూర్తి స్థాయి అనువాదం కాదిది. ఎప్పుడన్నా నేనే చెయ్యాలి. Thanks to Srujana for this work.

There no relation between the picture and the poem. Another version of this translation can be seen here

రెండు విడి విడి కవితలనుకున్నా ఇబ్బందేమీ లేదు. ;-)

Posted by గీతాచార్య Nov 18, 2009 7 people say 'Hello!'

విభిన్నకుటుంబాలు,పెంపకం నుండి వచ్చి ఒక్కటైన భార్యాభర్తలు తమ సంసారంలో ఎదుర్కునే సంఘటనలు, వాటిని సరిదిద్దుకుని ఏ గొడవా లేకుండా సంసార నావ ప్రయాణం సాగడం.. ఇలా పెళ్లికావలసిన, పెళ్లైన వారికి ఉపయోగపడే మంచి పుస్తకం గురించి మనకు పరిచయం చేస్తున్నారు నా స్పందన బ్లాగర్ లలిత దాట్ల.





'కోమలి గాంధారం".... పేరేమిటీ ఇంత గంభీరంగా వుంది. !  పైగా ఇదేదో సంగీతానికి . సంబంధించినదిలా వుంది? కోమలి అనే ఆవిడ గంధార రాగం నేర్పిస్తుందా ఏవిటీ? 

"కోమలి గాంధారం"...' పురుష సమాజం పోకడలపై నేటి మహిళ సన్నాయి నొక్కులు ' వారం రోజుల్లో సంగీతం నేర్పే పుస్తకం ఇది కాదని అర్ధమయిందికదా!

సరే ఇక పుస్తకం వివరాల్లోకెళితే.......

సాధారణ  ఆధునిక మధ్యతరగతి ఇల్లాలు కోమలి. ఇంటా, బయటా ( ఉద్యోగం చేసేచోట)  ఎదురయే , స్త్రీ పురుష అసమానతలను  తనదైన పద్ధతిలో సంస్కరించడానికి ప్రయత్నిస్తుంది. సమాజంలో  వేళ్ళూనుకు పోయిన పురుష అహంకార భావజాలాన్ని  ప్రశ్నిస్తుంది . అలాగని తనేమీ మగాళ్ళమీద యుద్ధం ప్రకటించదు. కూర్చోబెట్టి  సందేశాలు వినిపించదు.  కొంపలు కూల్చే నినాదాలివ్వదు  . తన సమయస్ఫూర్తితో , వాక్చాతుర్యం తో, అవసరమైన చోట్ల తన తెలివి తేటలతోను, పురుషాధిక్యతకు అడ్డుకట్ట వేస్తుంది. స్త్రీ పురుష అసమానతలను బయటపెడుతుంది . ' మగ ' అలోచనల్లోని సంకుచిత్వాన్ని బట్టబయలు చేస్తుంది.

"తెలుగు సాహిత్యంలో  ముణి మాణిక్యం నరసిం హరావు గారి  ' కాంతం కధలు ' , భానుమతీ రామకృష్ణ  ' అత్తగారి కధలు  ' తరువాత  తెలుగు  సంసారపు ముచ్చట్లతో , పాఠకులను సున్నితంగా గిలిగింతలు పెట్టిన రచన కోమలి గాంధారం "....అంటూ అబ్బూరి చాయదేవి గారు ప్రశంసించారు.

భార్యకి సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువైతే   భర్తకి వళ్ళంతా కనిపించని వాతలే. ఈ కధల్లో కోమలి భర్త పరిస్ధితి కూడా అంతే.  పైగా చాకచక్యంగా అత్తమామల్ని  తనవైపు తిప్పేసుకుంటుందేమో ......ఇక పాపం ఆ మానవునికి దెక్కెవరు. అందుకేనేమో రచయిత్రి తన రచన గురించి చెపుతూ, ఈ రచన సాగుతున్న కాలంలో ( వార్త లో కాలం గా వచ్చేది)  "మా  కొలీగ్ ఒకరు కోమలి భర్త ఫేన్స్ అసోసియేషన్ పెడతామని బెదిరించారంటే , మగాళ్ళకి బాగానే కోపం తెప్పించానని అర్ధమై సంతోషం కలిగింది" అంటారు.

అయ్యోరామా......ఇంతకూ రచయిత్రి గురించి చెప్పలెదుకదూ !

ఆకాశవాణి, దూరదర్శన్  తో కాస్తో కూస్తో పరిచయం ఉన్నవారికి డా.మృణాళిని గారిని ప్రతేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం ఉండదేమో . చెదరని చిరునవ్వు, చక్కని ఉచ్చారణ, మాటల్లో చమత్కారం  కలగలిపిన విధ్యాధికురాలు,( వామ్మో ఎన్ని డిగ్రీలో...) డా. మృణాళిని గారు.   ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ  వారే , కోమలి గా.....నా  తలపుల్లోకొచ్చేవారు.

చమత్కార  సంభాషనల్తో, ఆసక్తిగా సాగుతుంది కోమలి గాంధరం .ఒక్కో సన్నివేశం ఒక్కో కధ. అన్నింటిలోనూ కోమలిదే ప్రధాన పాత్ర . కో. భర్త,  కో. అత్తగారు, కో. కొలీగ్స్ , కో. స్నేహితులు , ఇందులో వచ్చిపోయే పాత్రలు . మన సంసారాల్లోనూ , సమాజంలోనూ  అడుగడునా ఎదురయ్యే స్రీ పురుష అసమానతల మీద రచయిత్రి వేసిన చమత్కార బాణాలు ఈ కధలు. అవి గుచ్చుకున్నవారికే ...అర్ధమవుతుంది ఆ బాధ.

అసమానతలా ...అవెక్కడున్నాయ్?,  ఆడవాళ్ళకీ ఉద్యగాలు చేసే అవకాశం ఇచ్చేసాంగా , మేం ప్రోత్సహించకుండానే ఇంత సాధించారా ! అని విరుచుకుపడే  మగ ప్రశ్నలకు సమాధానం .......

"ప్రధానంగా ఆడ లక్షణాలుగా స్ధిరపడిపోయిన  .....ఈర్ష్య , అలక, వ్యామోహం, అబధ్రత, జగడాలమారితనం , గాసిపింగ్ ఇంకా ఎన్నో  గుణాలు పురుషుల్లోకూడా అంత స్ధాయిలోనూ ఉన్నాయని చెప్పటానికి ప్రయత్నించాను. మగతనంగా తాము భావించే వాటిలో ఎన్ని తమ బలహీనతలో పురుషులకు తెలియ చెప్పటానికి ప్రయత్నించాను " అంటారు రచయిత్రి .

కధల విషయానికొస్తే......54 చిన్న చిన్న కధలు .  పుస్తకం చదువుతున్నంతసేపూ పెదవులపై చిరునవ్వు నాట్యం చేస్తూ వుంటుందంటేనే అర్ధం చేసుకోవచ్చు . కధలెంత  చమత్కారంతో సాగుతాయో.  కధలకు టైటిల్స్ పెట్టడంలోనే రచయిత్రి  సెన్సాఫ్ హ్యూమర్ బయటపడుతుంది.

" మాయదారి ముగ్గు" , " నోమిని", "ఆయనదేనికి" , మగని జ్వరం", " భోజ్యేషు భర్త"  , మూడిన కాలం", " ఆడబాస్" , " భార్య బదిలి" ," అలకానందుడు" ....ఇలా..ఇలా.


గుమ్మంలో అందరికంటే మంచి ముగ్గు వేసి తనపరువు కాపాడాలని , అయినా అడపుట్టుక పుట్టాక     ముగ్గులెయ్యటం రాదని ఎలా అనుకుంటాం అని సతాయిస్తున్న అత్తగారితో ......."మనం పరిశోధన చెయ్యాలత్తయ్యా,  ఆడపిల్లగా పుడుతూనే , ముగ్గులు పెట్టడం, పువ్వులు కుట్టడం, అంట్లు తోమటం పప్పురుబ్బటం, ఇల్లు ఊడ్చటం  ఎట్లా వచ్చేయ్యాలో ఎందుకు వచ్చేయ్యాలో , మనం పరిశోధన చెయ్యాలత్తయ్యా ..." అని తప్పించుకో చూస్తుంది , మాయదారి ముగ్గు కధలో.

'ప్రేమచ్చవం ' కధలో .....ఎంగేజ్ మెంట్ వరుడి అతి ప్రేమను తట్టుకోవటం కష్టంగా ఉందని వాపోయిన స్నేహితురాలికి  " ఇంత ఘాటైన ప్రేమకి నివారణోపాయం చాలా సింపుల్ , పెళ్ళి చేసుకోవటమే ....దెబ్బకు ప్రేమ కరిగిపోతుంది . నీకు ఊపిరాడుతుంది ." అని సలహా ఇచ్చి ఒడ్డున పడేస్తుంది కోమలి.

ఇంటిపనంతా నెత్తిన వేసుకొని , అనారోగ్యం పాలయి  అదో పెద్ద త్యాగంలా చెప్పుకు మురిసిపోయే ఇల్లాళ్ళమీద వ్యంగాస్త్రం - 'త్యాగమయి  '  కధ 

'ప్రేమించే భార్య ' కధలో  సినిమా హీరోయిన్ లా ఇరవై నాలుగ్గంటలూ  కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ....తనధ్యాసలోనే గడుపుతూ , తనొచ్చేదాకా భోజనం చెయ్యకుండా ఎదురుచూస్తూ , విరహగీతాలు ఆలపిస్తేనే  తనమీద ప్రేమ ఉన్నట్టని , అవన్నీ మచ్చుకైనా చేయని తన భార్యకి తనమీద ప్రేమలేదని సాధిస్తున్న భర్తకి .... షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి ఈ ఆడరోమియోతో  నా కొద్దు బాబోయ్ అనేలా చేస్తుంది
.
పరిపూర్ణ మహిళ పోటీలపై వ్యంగ్య " పరిపూర్ణమ్మ కధ"

" ఈ ఆడవాళ్ళు హంగామా చేస్తారు కానీ నిజానికి వంటెంత పనోయ్..." అంటూ మితృలందరి ముందూ బిల్డప్ ఇచ్చే భర్తకి  అంతే తెలివిగా వంట పని అప్పచెప్పి ..." ఇంత అద్భుతంగా వంట చేసే మీరుండగా నాకెందుకు దిగులూ  " అంటూ చురకవేసి ఉధ్యోగానికి వెళ్ళిపోతుంది' భోజ్యేషు భర్త  ' కధలో  .

ఈర్ష్య ' కధలో ఈ సన్నివేశం  చదివితే  నిజంగా నే కోమలి భర్తకి ఫేన్స్ అసోసియేషన్ అవసరమని తేలిపోతుంది.

రాత్రి భోజనాల తర్వాత కోమలి, కోమలి భర్త వాకింగ్ కు వెళుతున్నరు . కోమలి భర్త ప్రారంబించాడు .
" ఇవాళ సునంద నన్ను చూసి ఏమదో తెలుసా?"
" నాకు మీ ఆఫీసులో గూడచారుల్లేరు" అంది కోమలి   
"పోన్లే నేనే చెప్తాను . నేను వరండాలో నడుస్తుంటే ' రాజు వెడలె రవితేజములలరగ ' అన్నట్టుంటుందట"
"పాపం ఆ అమ్మాయి ఎప్పుడూ రాజుల్ని చూసుండదు "
జ్ఞాపకాల తన్మయత్వం లో ఉన్న కోమలి భర్త వినిపించుకోలేదు
మొన్న నేనోరోజు సెలవు పెట్టాను చూడు , ఆ మరుసటి రోజు నేను వెళ్ళగానే వాసంతి ఏమందో తెలుసా ?"
" నిన్నటి దినం ఎంత సుదినమో అందా" కోమలి అడిగింది.
కోమలి భర్తకు వినపడలేదు . అరమోడ్పు కన్నులతో  ఉన్నాడు.
నేనిలా ఆఫీసులో అడుగు పెట్టగానే ..." ఎదురు చూసి ఎదురుచూసి కన్నుదోయి అలసిపోయె" అని పాడుతోంది వాసంతి"
కోమలి గొంతు సరిచేసుకుంది. మీ ఆఫీసులో ఇంక ఎంతమంది అమ్మాయిలున్నారు ? లక్ష్మి, విజయ, కావేరి....వీళ్ళంతా ఏమన్నారో ఇప్పుడే చెపుతారా , వాయిదాల్లోనా?" 
కోమలి భర్త ఆగిపోయాడు " ఏం పాపం ఈర్ష్య గా వుందే.."?
కోమలి నవ్వింది." ఇంతకాలం నాకొక్కదానికే నచ్చిన మగాణ్ణి కట్టుకున్నాను . అని బెంగగా ఉండేది . నా ఎంపిక ఇంత నాసిరకంగా వుందేమాని. ఇవ్వాళ్టి తో ఆ బెంగ తీరిపోయింది , వేరే ఆడవాళ్ళకు కూడా మీరే నచ్చారంటే నా జడ్జి మెంటు మరీ చెత్తదేం కాదు"

సాధారణంగా భార్య  తన ప్రతిభతో పైకొచ్చి , పేరుతెచ్చుకుంటే ...నలుగురిలో మెప్పు పొందుతుంటే , ఆమె భర్తలో చెలరేగే అసూయ ,  కుళ్ళుమోతుతనం, పురుషహంకారం , ఇవేవీ పైకి కనపడకుండా పాట్లు పడుతూ , ఆదర్శ భర్త గా  గుర్తించబడాలని తాపత్రయం  ఇవన్నీ ...ఆమె భర్త, ప్రోత్సహించే భర్త , వంటి కధల్లో కనిపిస్తాయి .



ఇక్కడ నాదో చిన్న మాట:  పురుషహంకార, స్త్రీ పురుష అసమానతలు ఇవి ఉచ్చరించినవారు  సమాజ విద్రోహులుగానూ , ఇవన్నీ వినటానికి పెద్దమాటలుగానూ, మనకు సంభంధం లేనట్టూ అనిపించచ్చు కానీ...... మనం మనకే తెలీకుండా  అలవాటు పడిపోయిన నిత్య సత్యాలు . నీకేం తెలుసు....నోర్మూసుకో.....నన్నే ప్రశ్నిస్తావా....నేను నీకు సమాధానం చెప్పాలా.....    నీ హద్దులు తెలుసుకో   .........ఎంత సంపాదిస్తే మాత్రం  ఇంత పొగరా........... ఉధ్యోగం కావాలో   ఇల్లూ పిల్లలూ కావాలో తేల్చుకో ........చ్చీ, చ్చీ,  ఆడంగి పనులు నేను చెయ్యాలా.......నేను నువ్వూ ఒకటే ఎలా అవుతాం........నేనేం చేసినా చెల్లుతుంది.......నా మాటకు ఎదురు చెప్పొచ్చా........అబ్బో, ఇలా చాలా చాలా  డైలాగులు  అప్పుడు, ఇప్పుడూ మగాడి నాలుకే వర్షిస్తుంది.(  అది పడే భూమాత ఓర్పును బట్టి  ఆ వర్షంలో  హెచ్చుతగ్గులుంటాయి) )   ఇదీ అసమానతే, పురుష అహంకారమే ....కాదంటారా ? 

కోమలి గాంధారం చదివిన వారెవరైనా " కోమలి " అభిమానులయి తీరాల్సిందే.........లేదంటే గుమ్మడికాయ దొంగ మీరే.


కోమలి గాంధారం
హాసం  ప్రచురణ

Posted by జ్యోతి Nov 15, 2009 2 people say 'Hello!'




భమిడిపాటి ఫణిబాబు మ్యూజింగ్స్ ద్వారా ఎన్నెన్నో కబుర్లు చెప్తుంటారు కదా. ఈసారి మనకోసం ఒక మరాఠీ సినిమా గురించి పరిచయం చేస్తున్నారు.

భమిడిపాటి ఫణిబాబు Says...

మరాఠీ సినిమాలకి అఖిలభారత స్థాయిలో ఎక్కువ ప్రాచుర్యం లేదు. కానీ,కొన్నికొన్ని ఆణిముత్యాలు వచ్చాయి. ఈసంవత్సరం భారత ప్రభుత్వ ఆస్కార్ ఎంట్రీ కూడా ఒక మరాఠీ సినిమా'హరిశ్చంద్రాచీ ఫాక్టరీ' అవడం గమనార్హం. ఇంక ప్రస్తుతానికొస్తే, మామూలుగా మరాఠీ సినిమాలు, చాలా తక్కువ ఖర్చుతో తీస్తూంటారు ,కానీ దీనికి విరుధ్ధంగాఈ సినిమాకి భారీగానే ఖర్చు పెట్టారుట. సినిమా పేరు వినగానే అదేదో చారిత్రాత్మక సినిమా అనుకుంటే పొరబాటే.


ఈ సినిమా ముంబైలో ఒక బ్యాంకు లో పనిచేసే ఒక గుమాస్తా గురించి, తనూ,తన కుటుంబం(భార్యా, నటి అవాలని తపిస్తున్న ఒక కుమార్తె, ఇంజనీర్ అవాలనుకునే ఒక కుమారుడు).అతనికి మధ్యతరగతి గృహస్థు లాటి ఆశలూ,కోరికలూ చాలా ఉంటాయి

ఆఫీసు నుండి వస్తూ ఓ 'మాల్' లోకి వెళ్ళి 'విండో షాపింగ్' చేయడం,ఒక బ్రాండెడ్ షర్ట్ పాపం చాలా నచ్చుతుంది, కానీ దాని ఖరీదు చూస్తే తన తాహతుకు మించి ఉంటుంది. ప్రతీ వారం ఆ 'మాల్' లోకి వెళ్ళడం,తన ప్రియతమ షర్ట్ ని ఒకసారి తాకి, ఆనందించడం.ఒకసారి ఆ కొట్టు యజమాని ఇతన్ని అవమానపరిచి బయటకు తోసేస్తాడు,'కొనడానికి తాహతు లేనివాడు,మాల్ లోకి రావడానికి అనర్హుడూ'అంటూ.అలాగే చేపల మార్కెట్ లోకూడా,అవమాన పడతాడు.ఇవన్నీ చూసి తను చాలా బాధ పడతాడు,'తను మహరాష్ట్రియన్' గా పుట్టడం వల్లే ఈ అవమానాలన్నీ అవుతున్నాయనుకుంటాడు.మిగిలిన భాషలు మాట్లాడే వాళ్ళు,అక్కడ బ్యాంకులో పనిచేసేవారైనా,లేక రోడ్డుమీద వెళ్ళేవారైనా,తనకంటేఎక్కువ స్థానంలో ఏదో బాగుపడిపోతున్నట్లు ఇతనికి ఒక 'ఆత్మన్యూనతాభావం'వస్తుంది. ఇది ఇలా ఉండగా, తను కుటుంబంతో ఉంటున్న బంగళా (తనకి వారసత్వం లో వచ్చింది)మీద ఒక రియలెస్టేట్ వాడి కళ్ళు పడతాయి. ఎలాగైనా,చవకలో ఈ బంగళా కొట్టేసి, అక్కడొక షాపింగ్ కాంప్లెక్స్
కట్టేద్దామని,మన హిరో ఇంటికి ఒక ప్రతిపాదన తో వస్తాడు.ఊరికి ఎక్కడో దూరంగా ఉండే 'బద్లాపూర్' లో ఒక ఫ్లాటూ, ఓ శాంట్రో కారూ, 50 లక్షలూ ఇచ్చేటట్లుగానూ, విలేపార్లే లో వీళ్ళుంటున్న బంగళా తనకు అమ్మేటట్లూనూ.

మన హీరో భార్యా,పిల్లలూ ఎగిరి గంతేస్తారు. ఇతను ససేమిరా ఒప్పుకోడు.అక్కడ కూతురు సినిమాల్లో చేరడానికి,ఆడిషన్స్/స్క్రీన్ టెస్ట్ లకి వెళ్ళినప్పుడు,ఆ ప్రొడ్యూసర్,'నీ యాక్షన్ బాగానే ఉందికానీ, నీ పేరు(భోస్లే ) బాగొలేదు,మార్చేసుకో' అంటాడు.అలాగే కొడుకు కి ఎంట్రెన్స్ పరీక్షలో ఒక మార్కు తక్కువయ్యేటప్పడికి, పేమెంట్ సీటే గతౌతుంది.అంత డబ్బు వీళ్ళదగ్గర లేదు.తనకి ఎవరో పేద్ద రాజకీయ నాయకుడు క్లాస్ మేట్ ఉంటే అతని దగ్గరకి కొడుకుని తీసికొని వెళ్తాడు.'ఎక్కడైనా బావ కానీ,వంగతోటలో కాదు' అన్నట్లుగా ఇంజనీరింగులో ఏముందీ,ఊరికే డబ్బు వేస్టూ, శుభ్రంగా గ్రాడ్యుఏషన్ చేయించేసి, బ్యాంకులో ఉద్యోగం చేయించేయ్ అంటాడు.

ఈ రెండు సంఘటనలతో,హీరో పూర్తిగా నిరుత్సాహపడిపోయి, తను 'మరాఠీ మానూస్' అవడంవల్లే తనకు, ఇలాటి
అవమానాలు ఎదురతున్నాయనుకుంటాడు. ఈ సమయంలో ఇతను పడే వేదనంతా ఎక్కడో'రాయఘడ్' లో ఉన్న శివాజీ మహరాజ్ కి వినిపిస్తుంది.ఇక్కడనుండి, సినిమాలో 'లగేరహో మున్నాభాయ్' ఛాయలు కనిపించడం మొదలెడతాయి.శివాజీ తన అనుచరుడితో'ముంబై'వచ్చేసి, ఇతనికి జ్ఞానబోధ చేస్తాడు.నువ్వు 'మరాఠీ మానుస్' అవడం వల్లకాదూ,నీ కష్టాలూ,నీ వ్యక్తిత్వలోపం వల్లే నిన్నందరూ చిన్నచూపు చూస్తున్నారూ, అని ఇతనిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు.ఇంక మన హీరో పేట్రేగిపోతాడు. ఇంక మన హీరోని పట్టుకోవడం ఎవరి తరమూ కాదు.ఇతను ఏదైనా సమస్యలో పడితే 'శివాజి మహరాజ్' ఇన్స్పిరేషన్ తో అన్నింటినీ అధిగమించి ఆఖరిగా విజయం పొందుతాడు.


సినిమాకి సంభాషణలు ఓ హైలైట్.మహరాష్ట్రలో గత 45 ఏళ్ళుగా ఉండడం వలన, మరాఠీ సంభాషణలు అర్ధం చేసికోవడం, ఆస్వాదించడం ఏమీ కష్టం కాలేదు.క థానాయకుడు 'దినకర్ రావు భోస్లే' గా  సచిన్ ఖేడ్కర్ అద్భుతంగా పాత్రలో జీవించేశాడు. శివాజీ మహరాజ్ పాత్రలో మహేష్ మంజ్రేకర్ ఫరవా లేదు. ఒక మధ్యతరగతి గృహస్థు కి ఉండే ఆశలూ,అవి తీర్చుకోలేని అసహాయతా, దీనివలన వచ్చే 'బక్క కోపం',దానిని అర్ధం చేసికోలేని కుటుంబసభ్యులూ, వారి ప్రవర్తనా, వీటిని 'క్యాష్' చేసికోవడానికి 'గుంట కాడి నక్క' లా ఉన్న,రియల్ ఎస్టేట్ బిల్డరూ,వాడు హీరో భార్యకిచ్చే 'తాయిలాలూ' బలేగా చిత్రీకరించారు.

Posted by జ్యోతి Nov 13, 2009 4 people say 'Hello!'





పి ఎస్ ఎమ్ లక్ష్మి గారు యాత్ర బ్లాగ్ ద్వారా సుప్రసిద్ధులు. వారు మనసున మనసై పాట గురించి ఇలా చెప్తున్నారు.


అందరికీ తెలిసిన ఒక తెలుగు సినిమా పాట గురించి మళ్ళీ చెప్దామనుకుంటున్నాను.  ఎందుకీ సుత్తి అంటారా  ఎన్నో ఏళ్ళనుంచి వింటున్న ఆ పాత పాటలో ఇవాళ నాకు క్రొత్త అర్ధాలు స్ఫురించాయి.    అద్భుతమైన రచనల గురించి ఆలోచిస్తున్నకొద్దీ కొత్త కొత్త అర్థాలు  బయటపడతాయి.  అందుకేనేమో పూర్వం ఒక్కో గ్రంధానికి అనేకమంది అనేక వ్యాఖ్యలు రాసేవారు. 

                 మనసున మనసై బ్రతుకున బ్రతుకై
                 తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గమూ

ఆణి ముత్యాల్లాంటి ఇలాంటి భావాలు పాట రూపంలో పెల్లుబకాలంటే ఆ కవి హృదయంలో ఎంత అంతర్మధనం జరిగుండాలో మరి.  మన మనసూ, బ్రతుకూ, అంతా తానై నిండి వుండే తోడు కావాలని ఎవరికనిపించదండీ.  ఆ తోడు జీవిత భాగస్వామే కానక్కరలేదు.  ఎందుకంటే వివాహమనే లాటరీలో అలాంటి తోడు అందరికీ లభిస్తుందని గ్యారంటీ లేదుకదా. 

                   ఆశలు తీరని ఆవేశములో
                   ఆశయాలలో, ఆవేదనలో
                   చీకటి మూసిన ఏకాంతములో                
                   తోడొకరుండిన  అదే భాగ్యమూ, అదే స్వర్గమూ

ఏ మనిషికైనా బ్రతుకు పోరాటంలో తీరని ఆశలు, నెరవేరని ఆశయాలూ తప్పవు.  వాటికోసం పోరాటాలూ, ఆరాటాలూ అంతకన్నా తప్పవు.  ఇలాంటి సమయాల్లో మన హృదయానికి చేరువగా వచ్చి మన ఆరాటాలనర్ధం చేసుకుని వెన్నంటి నిలిచే నేస్తం వుంటే వాళ్ళ బ్రతుకులు ధన్యంకావా!?

                    నిన్ను నిన్నుగా ప్రేమించుటకు
                    నీకోసమే కన్నీరు నించుటకు
                    నేనున్నానని నిండుగ పలికే
                    తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గమూ

ఎంత గొప్ప భావమండీ!  వెతికితే ఎన్ని అర్ధాల రతనాలేరుకోవచ్చో ఈ చిన్ని మాటల్లోంచి.  నిన్ను నిన్నుగా ప్రేమించుటకు.....అంటే మనలోని లోటుపాట్లని కూడా అర్ధంచేసుకోగలగాలి, భరించగలగాలి, ఆ లోటుపాట్లతో సహా మనల్ని ప్రేమించ గలగాలి.  మన భంగపాటు తనదిగా బాధ పడటమే కాకుండా అలాంటి సమయాల్లో నీకు తోడుగా నేనున్నానని నిండుగా, మనస్ఫూర్తిగా పలకాలి.  అలాంటి స్నేహితులున్నవారి బ్రతుకే బ్రతుకుకదా.

                      చెలిమియె కరువై వలపే అరుదై
                      చెదరిన హృదయమే శిలయైపోగా
                      నీ వ్యధతెలిసీ నీడగ నిలిచే
                      తోడొకరుండిన, అదే భాగ్యమూ, అదే స్వర్గమూ

చెలిమి కరువైనప్పడూ, వలపు అరుదైనప్పుడూ ఆ జీవితమే వ్యర్ధమనిపిస్తుంది.  మనిషి డిప్రెషన్ లోకి వెళ్ళి పోతాడు.  అలాంటి వ్యధలో  తన నీడగా నిలిచి బ్రతుకుపై తీపి పెంచి, బ్రతుకు విలువ తెలిపి జీవితాన్ని నిలబెట్టే తోడుకన్నా మనిషికి కావాల్సిందేముంటుంది.

అతి మామూలు చిన్న చిన్న మాటలలో తరచినకొద్దీ వెలువడే అపురూపమైన అర్ధాలు పొదిగి ఈ పాట వ్రాసిన మనసు కవి శ్రీ ఆత్రేయగారు నిజంగా ధన్యులు.  ఈ పాటను తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరూ వినే వుంటారు, వారి వారి పరుధుల్లో అర్ధం చేసుకునే వుంటారు.  అలాగే  మొదటిసారి విన్నప్పటినుంచీ ఇప్పటిదాకా  నాకూ ఇది అత్యంత ప్రీతిప్రదమైన పాట.  రోజూ పిచ్చిగా విననుగానీ విన్నప్పుడల్లా హృదయం ఆర్ద్రతతో నిండిపోతుంది.  ఎంత గొప్ప భావాలు పలికించారు శ్రీశ్రీ గారు.  అలాంటి పాటలు వ్రాయాలంటే ఎంత అదృష్టం వుండాలి.

ఆకస్మాత్తుగా ఇవాళ అర్ధ రాత్రి ఆ ఆలోచనలు ఇంకో కోణంలో మనసుని తట్టిలేపాయి.  పాట బాగుందనుకున్నావు...ఇన్నాళ్ళూ విన్నావు.....ఆలోచించావు...అలాంటి నేస్తం వుండాలని ఆరాట పడ్డావు...సరే...ఇవ్వన్నీ సహజాలు....కానీ నువ్వు ఎవరికైనా అలాంటి నేస్తంగా వుండాలని ప్రయత్నించావా అని ప్రశ్నించాయి.

కవి వ్రాసిన గీతానికీ, నేను ఆ పాటని అంతగా ఇష్టపడ్డదానికీ నిజమైన విలువ ఆ ఆలోచనలతోనే లభించిందనిపించింది.

తమకలాంటి తోడు కావాలనుకోవటం ప్రతి మనిషికీ సహజం.  కానీ ప్రతి మనిషికీ అలాంటి తోడు దొరకటం జరిగే పనేనా?   కడుపునిండిన కొందరైనా ఆరాటాల సుడిగుండాల్లో చిక్కుకున్నవాళ్ళకి జీవితాంతంకాకపోయినా తత్కాలంలో వున్న సమస్యకు సాదరంగా స్పందించి సాంత్వన ఇవ్వగలిగితే, కనీసం ఆ సమస్య తీరేదాకానైనా అతలాకుతలంగావున్న వారి హృదయాలలో ధైర్యం నింపి  ప్రశాంతతని ప్రసాదించగలిగితే, ఆ చేయూతతో వారి జీవిత నావ భవసాగరాలు దాటదా అలా ఒకరికొకరైతే ప్రపంచం అంతా అందరికోసమూకాదా?  అప్పుడు సమస్యల అడ్రసెక్కడ?  ఒక వేళ ఎక్కడైనా ఒకటీ అరా తలెత్తినా ప్రేమ అనే వెచ్చని సూర్య రశ్మితో మంచు తెరల్లా కరిగిపోవా?

ఇవ్వన్నీ ఒక్క క్షణంలో, ఒక్క రోజులో అయ్యే పనులు కావు.  కానీ ఆలోచించగలిగిన ప్రతి ఒక్కరూ కొంతయినా ఆచరిస్తే ప్రపంచం ఎంత బాగుపడుతుంది.  అప్పుడు చిక్కల్లా ఒక్కటే.  ఇలాంటి అద్భుతమైన పాటలు రాకపోవచ్చు.

అంధకారం గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా చిరుదివ్వెని వెలిగించే ప్రయత్నం చెయ్యి అనే సుజన సూక్తి ఆధారంగా, ఇప్పటికే వెలుగుతున్న దీపాలకు తోడుగా ఇంకొన్ని దీపాలు వెలిగించాలనే ఉద్దేశ్యంతో ఈ పోస్టు.

Posted by జ్యోతి 5 people say 'Hello!'




Bad gal ప్రియ అందించిన ఆణిముత్యం.. దీనికోసం ఎన్నిరోజులనుండి షంటబడిందో ;) ఇంతకు మునుపు మనకి ఉక్రేనియన్ జానపద గాధలను గురిమ్చి చెప్పిన ప్రియ ఈ సారి కాస్తంత సీరియస్ ఆర్టికిల్ ఇస్తోంది.

ప్రియ Says...

Invisible Man. ఈ మధ్య చాలా కష్టపడి చదివిన కథ/నవల. అల్లరి పిల్లవి. ఎంత సేపూ నీకు హాస్య కథలే ఎక్కువ నచ్చుతాయి, సీరియస్‍నెస్ తక్కువ. పట్టుమని పదినిమిషాలు స్థిమితంగా కుదురుగ్గా ఉండవు. ఇవండీ నా మీద కంప్లైంట్లు.

నాకెందుకో మొదటి నుంచీ ఎక్కువగా నీరసంగా ఉండేవో, లేదా ట్రాజిగ్గా ఉండేవో కథలంటే నచ్చవు. అన్నీ హీరోయిగ్గా ఉండాలి. లేదా సరదాగా ఉండాలన్నమాట. ఎందుకంటే కష్టాలూ, కన్నీళ్ళూ అన్నీ మన జీవతంలో ఉండనే ఉంటాయి. సో కథల్లోనూ, ఊహల్లో కూడా అవెందుకని. అసలే నాకు ఏడుపంటే యాఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఅక్ ;-)

కానీ ఈ మధ్య చదివిన ఈ నవల నాకు బాగా నచ్చింది. వీలున్నంత క్లుప్తంగానైనా ఈ నవల గురించి చెప్పాలని. Invisible Man అనే పేరుతో రెండు ప్రముఖ నవలలున్నాయి. ఒకటి HG Wells రాసిన సైన్స్ ఫిక్షన్. రెండోది Ralph Elison రాసింది. నేను రాయ బోతోంది Ralph Elison రాసిన హృద్యమైన నవల గురించి. దీని గురించి ఒక పద్ధతిలో చెప్పాలంటే కుదరని పని. చాలా సంక్లిష్టమైన నవల. కథా కథనాలు కలగలసి పోయి ఉంటాయి. అయినా నా సాహసం నేను చేశాను. ఎంతైనా ట్రయే సాధయే ఫలే అన్నారు కదా పెద్దలు. ;-)

కథంతా ఒక narrator point of view లో నడుస్తుంది. Narrator ఒక నల్లజాతీయుడు. మంచి వక్త. అతని జీవితంలో జరిగిన అనేకానేక సంఘటనలు, పొందిన గౌరవాలూ, అవమానాలూ, ఎదుర్కున్న దాడులూ, చివరికి అండర్‍గ్రౌండ్ లో దాగుండటం, మొదలైన సంఘటనలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందీ నవల.

సంఘటనలని సృష్టించటంలో రచయిత చూపిన శ్రద్ధ ఎందుకో కథనాన్ని మరింత బిగువుగా నడపటం మీద పెట్టినట్టనిపించలేదు. But anyway it is an interesting read, and also a must read for serious book lovers. నల్లజాతీయులు, వారి మానసిక స్థితిగతులూ, ప్రవర్తనా, తెల్లజాతీయుల ఆగడాలూ, brotherhoods, అందులోని వారి insecurities మాత్రం చక్కగా వర్ణింపబడ్డాయి. తనని తానుగా, అసలు తన ఉనికినే గుర్తించకుండా, తననో స్టీరియోటైప్ గా భావించే సమాజంలో narrator మనోభావాలే ఈ కథా వస్తువు. అతని కనబడని వ్యక్తిత్వమే (జనానికి కనబడని/వారు గుర్తించలేని గుర్తించినా బయటపడని)  ఇక్కడ ఇన్విజిబుల్ అన్న పదానికి justification.

Invisible Man అన్న పేరుకు తగ్గట్టుగానే narrator ఆద్యంతం in'visible' గానే ఉంటాడు. ఈ కథలో నాకు బాగా నచ్చిన భాగం narrator స్కూల్ నుంచీ గెంటివేయబడ్డాక అతనికి తన స్కూల్ అధ్యక్షుడు రికమెండేషన్ లెటర్ ఇచ్చిన సందర్భం. ఎందరి వద్దకో ఆ రికమెండేషన్ లెటర్ పట్టుకుని వెళ్ళిన narrator కి అన్నిచోట్లా నిరాశే ఎదురవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనికి కొలువు దక్కదు. చివరికి ఒకతను చెప్పిన అసలు రహస్యం ఆశ్చర్యానికి గురిచేస్తుంది పాఠకులని. అదేమంటే, ఇక మన నాకవరేణ్యుడు ఆ స్కూలుకి తిరిగి రాకుండాను, అతనికి కొలువు దక్కకుండాను చూడమనీ, ఆ విషయం అతనికి తెలియకుండా దాచమనీ చెప్తాడు. ఈ కథాక్రమమంతా చాలా గొప్పగా రాయబడింది.

అలాగే కొన్ని కొన్ని సంఘటనలు, కథనంలోని విషయాలు మనని ఆపకుండా చదివిస్తాయి. చివరికి అతను ఒక paint factory boiler room లో ఉద్యోగం సంపాదించినా... ఒక సహోద్యోగి దాడిలో గాయపడి హాస్పిటల్ పాలవుతాడు. డాక్టర్ల సంభాషణలో తనని ఒక మెంటల్ పేషన్ట్ గా భావిస్తున్నారనీ, షాక్ ట్రీట్మెంట్ ఇవ్వబడిందని కూడా తెలుసుకుంటాడు.

అక్కడినుంచీ బయట పడ్డాక ఆ ఫాక్టరీలో కొనసాగలేక న్యూయార్క్ నగర వీధుల్లో తరుగుతూ ఒక ముసలి దంపదులకు జరిగిన అన్యాయం మీద తన మాటల ద్వారా తిరగబడి, తన ఉపన్యాసాల ద్వారా జనాన్ని ఆకర్షించి, వారిని గెంటివేసిన మార్షల్ మీద జనం తిరగబడేలా చేస్తాడు. ఆ సందర్భంలో దొమ్మీలు జరిగినా మన narrator కమ్యూనిస్టిక్ భావజాలం కలిగిన ఒక brotherhood దృష్టినాకర్షించి అక్కడ వక్తగా, ((ఒకరకంగా mouth piece of the brotherhood) మారి క్రమంగా అక్కడ ఉన్నత స్థానానికి ఎగబాకుతాడు. ఈ బ్రదర్‍హుడ్ శ్వేతజాతీయుల కనుసన్నలలో నడుస్తున్నదని అనుమానం కలిగిన రాస్ అనే వ్యక్తి తో ఇతని సంఘర్షణ మరో మలుపిందులో. ఇక్కడి నుంచీ కథ ముదిరి పాకాన పడుతుంది.

కొన్ని అపార్ధాల వల్ల ఆ బ్రదర్‍హుడ్ నుంచీ దూరమై, రాస్ అనుచరుల వల్ల అవమానాపహాస్యాలకు గురై పారిపోయి మారువేషాలలో తిరుగుతూ, తన వ్యక్తిత్వం, తన identity ఆ బ్రదర్హుడ్ కి ముఖ్యం కాదనీ, కేవలం తన శరీరపు రంగే తనకా స్థానాన్ని అందించిందనీ, రాస్ అనుమానాలు నిజమనే భావనకు వచ్చి, తన ఐడెంటిటీ గురించిన ఆలోచనలో ఉండగా రాస్, అతని అనుచరులు మొదలెట్టిన riots లో వారికి చిక్కి, ఉరితీయమన్న రాస్ ఆదేశాలనుంచీ ఎలాగోలా తప్పించుకుని పోతూ, చివరకో manhole లో పడిపోతాడు. అక్కడే తన నివాసాన్ని ఏర్పరుచుకుంటాడు.

రాస్ తిరిగి జనజీవనంలోకి వద్దామనే భావనతో నవల ముగుస్తుంది. తన invisibility గురించి మొదట్లో బాధ పడ్డా, చివరికి అదే తనకు ఆనందాన్నిస్తుందని తెలుసుకుంటాడు.చదివిన తర్వాత కూడా ఎమ్తోసేపు ఆలోచింపజేసే నవల ఇది.

Ralph elison రాసిన ఏకైక నవల ఇది. చదివి తీరాల్సిన నవల. I give 4 out of 5. And You won' regret reading it.

***   ***   ***

We thank ప్రియ for giving us an excellent article.

Posted by జ్యోతి Nov 12, 2009 7 people say 'Hello!'

కవి, సాహిత్య విమర్శకుడు, రచయిత ఐన శ్రీ మాకినీడి సూర్యభాస్కర్ గారు అందించిన అందమైన కవిత..


మరీ అందగత్తేం కాదు

కానీ...
పులుగడిగిన ముత్యంలా ఉంది
ఏమనుకుంటుందోన్న ధ్యాసే లేదు
తదేకంగా చూస్తున్నా!



ముంగిట రంగోలీ దిద్దుతున్నదామె;
మెడ వంపులో వేలాడే చెవి లోలకం...
ముత్యం అంచు మీద చంద్రోదయం!

ఆమె
చాలా అందంగా ఉంది.


- మాకినీడి సూర్య భాస్కర్

Posted by జ్యోతి Nov 11, 2009 5 people say 'Hello!'























మునిమాణిక్యం కథలంటే తెలీని వారు ఉండరేమో. దాంపత్యంలోని చిన్ని చిన్ని చిలిపి తగాదాలు, సర్దుబాట్లు,జరుగుబాట్లు ఇలా ప్రతి దంపతులకు తప్పనిసరిగా అవసరానికొచ్చే విషయాలు ఎన్నో ఈ కథలలో ఉంటాయి. మునిమాణిక్యంగారి కాంతం గురించి మనకు సవివరంగా అందిస్తున్నారు శ్రీలలిత బ్లాగర్..


శ్రీ మునిమాణిక్యం వారి ”కాంతం” కథలను తలుచుకుంటే మనకి తెలియకుండానే మన పెదవులు చిరునవ్వుతో విచ్చుకుంటాయి. దాంపత్య జీవితం లో ప్రతిరోజూ మామూలుగా జరిగే దినచర్యలో కూడా హాస్యం పండించడం ఆ మహానుభావునికే చెల్లింది. కాంతం అచ్చమైన తెలుగింటి ఇల్లాలు. భర్త అంటే బోలెడు ఇష్టం. అదే సమయం లో పాపం ఆయన కేమీ తెలీదని, ఆయన అమాయకత్వంపై బోలెడు సానుభూతి.


మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలను, దాంపత్యోపనిషత్తును పంతొమ్మిదివందల యాభైనాలుగు లో యం.శేషాచలం అండ్ కంపెనీ వారు ముద్రించారు.మళ్ళీ పంతొమ్మిదివందల తొంభై అయిదులో శ్రీమానస పబ్లికేషన్స్ వారు ముద్రించారు.అన్ని పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతాయి.


దాంపత్యోపనిషత్తు అయినా, కాంతం కథలయినా మునిమాణిక్యం గారి వి ఏవయినా సరే ఈ తరం వారికి తెలియక పోవచ్చునేమొ కాని క్రితం తరం వారికి తప్పక తెలిసే ఉంటాయి. ఆ అనుభూతి వారు పొందే ఉంటారు. ఇప్పటివారికి కూడా వారి గురించి చెప్పడమంటే సూర్యునికి దివిటీ చూపించినట్టే అని నేను భావిస్తున్నాను.


కాంతాన్ని ప్రధానపాత్ర గా చేసుకుని మునిమాణిక్యంగారు చాలా కథలు వ్రాసారు.

ఇల్లు ఇల్లాలు, ఇంటావిడతో పోట్లాట, ప్రణయ కలహం, కాంతం కథలు, కాంతం కైఫీయతు, నేనూ మా కాంతం, దాంపత్యోపనిషత్తు ఇలాంటివి చాలా పుస్తకాలు వ్రాసారు. భార్యాభర్త లిద్దరూ పోట్లాడుకుంటుంటే ఒక విధమైన సంగీతం పుడుతుందని ఆయన చెప్పిన గొప్ప మాట. అలాగని ఒకరంటె ఒకరు ఇష్టపడరని కాదు. ఇష్టమె. కాని ఆ ఇష్టం లోనే ఒకరకమైన గడుసుదనం గల ఇల్లాలు కాంతం.


భర్త ఎక్కడికైనా ప్రయాణమై వెడితే ఏదో ఒకటి పోగొట్టుకుని వస్తారని నిక్కచ్చిగా నమ్మే గృహిణి కాంతం. అందుకే వెళ్ళేటప్పుడు ఎన్ని జాగ్రత్తలో చెపుతుంది. అయినా ఆయన బెడ్డింగు, శాలువా పారేసుకునే వస్తారు. ”నేను పారేసుకోలేదు...వెనకాల వస్తున్నాయీ..” అని ఎంత చెప్పినా ఆవిడ అభిప్రాయం మారదు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణలు, లౌక్యంగా కాంతం భర్త దగ్గరినుంచి విషయం రాబట్టడానికి చేసే ప్రయత్నాలు అన్నీ మనల్ని అలరిస్తాయి. మామూలుగా మన ఇళ్ళలో జరిగే సంభాషణలనే ఎంతో చతురంగా వర్ణిస్తారు. సాయంత్రం ఆయన స్నేహితులతో కలిసి షికారు వెడుతుంటే, ”పండక్కి ఫలహారాలు చెయ్యాలి, పిల్లల్ని పట్టుకుందురుగాని తొందరగా రండి” అని చిలక్కి చెప్పినట్టు చెపుతుంది. అయినా ఆయన రావడం ఆలస్యమవుతుంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణ స్వయంగా చదవాలి తప్పితే, వేరే వాళ్ళు చెపితే ఆయనకు అన్యాయం చేసినట్టే అవుతుంది. పిల్లకి పేరు పెట్టే విషయం లోనూ బలే జాణలా మాట్లాడుతుంది కాంతం. ”మీ పిల్ల కదా.. మీకు నచ్చిన పేరు పెట్టండి” అంటూనే ఆయన చెప్పిన ప్రతి పేరునీ ఏదో కారణం చెప్పి తిప్పి కొడుతుంది. అలాగని తను ఫలానా పేరు పెట్టమని చెప్పదు. ”మీ ఇష్టం” అంటూనే ఉంటుంది. తీరా అందరి అభిప్రాయాలూ కలిపి పేరు పెట్టాక ఆ పేరు తో పిలవకుండా తను మళ్ళీ వేరే పేరు పెట్టి పిలుస్తుంది.


ఒక కథలో కాంతానికి ప్రబంధనాయికల లాగ విరహం అంటే ఏమిటో తెలియచెయ్యాలని పాపం ఆ భర్తగారు చేసే ప్రయత్నం మనకి ఎంతో నవ్వు తెప్పిస్తుంది.


మరో కథలో కాంతం భర్త ఆవిడ అక్కగారి దగ్గర తను ఎంత మంచి భర్తో నిరూపించుకోవడానికి చాలా పెద్ద హామీ ఇచ్చి వాళ్ళిద్దరినీ కార్తీక మాసంలో తెల్లవారుఝామునే నదీ స్నానానికి పంపిస్తాడు. ఆ హామీ ఏమిటంటే వాళ్ళు స్నానం చేసి వచ్చేదాకా పిల్లలని తను చూసుకుంటానని. తెల్లవారితేకాని పిల్లలు ఎలాగూ లేవరు, ఈలోపల వాళ్ళ స్నానం పూర్తయి వాళ్ళు రానే వస్తారు, మహా అయితే వాళ్ళొచ్చే ఓ గడియ ముందు పిల్లలు లేస్తారు. ఆ కాస్సేపూ పిల్లల్ని చూసుకుని వదినగారి దగ్గర మంచివాడనే సర్టిఫికెట్టు కొట్టెయ్యవచ్చని ఆయన ఉద్దేశ్యం.ఇంక చూడాలి పాపం ఆయన పడ్డ పాట్లు. ఇంకా చాలా రాత్రుండగానే నిద్దట్లో ఎడపిల్ల కదులుతుంది. ఆ కదలికకి చంటిపిల్ల లేచి పాలకోసం ఏడుపు మొదలు పెడుతుంది. ఆయన పాలు కలుపుకుని వచ్చేలోపు ఆ ఏడుపుకి ఎడపిల్ల లేచి అమ్మ కోసం వెతుక్కుని కనపడక ”అమ్మా” అంటూ రాగం మొదలుపెడుతుంది. ఆ ఏడుపుకి చంటిపిల్ల పాలు తాగడం మానేసి రాగం కలుపుతుంది. ఈ చంటిపిల్ల ని ఊరుకోపెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే ఎడపిల్ల నెమ్మదిగా వెళ్ళి పెద్దవాణ్ణి లేపి అమ్మ కనిపించటం లేదని చెపుతుంది. వాడు వీధి తలుపు తీసుకుని అమ్మకోసం బైటకి వెళ్ళి వెదుకుదామని వెళ్ళబోతాడు. ఈ గోలకి ఇంకో పిల్ల లేచి అన్నతో వీధిలో కి వెళ్ళాలో, నాన్న పిలుస్తుంటే అక్కడే నిలబడాలో తెలిక వీధి గుమ్మం దాటి, ఆ పక్క కాలవలో పడబోతుంది. పాపం ఆ తండ్రి ఏడుస్తున్న చంటి పిల్లను చంకలో ఎత్తుకుని, పెద్దపిల్ల కాలవలో పడిపోకుండా ఆపడానికి గబుక్కున ఆ కాలవలోకి దిగుతాడు. సరిగ్గా ఆ సమయానికి కాంతం, ఆవిడ అక్కగారు ఇంటి ముందు జట్కా దిగుతారు. వాళ్ళు దిగేటప్పటికి సీను ఎలా ఉంటుందంటె, చంటిపిల్లని ఎత్తుకుని ఆయన కాలవ మధ్యలో నిలబడి, రెండో చేత్తో ఎడపిల్లని ఆపుతూ, పెద్దపిల్లలని ఊరుకోబెడుతూ అష్టావధానం చేస్తూ కనిపిస్తారు. కాంతం జట్కా దిగగానే ఆయన పరిస్థితి చూస్తుంది. కాస్తయినా తనని జాలితో చూస్తుందేమో ఆవిడ అని ఈయన ఆశిస్తారు. కాని ఆవిడ దబుక్కున ఈయన చేతుల్లోంచి చంటిపిల్లని లాక్కొని ఒళ్ళో కూర్చోబెట్టెసుకుని, ఎడపిల్లని దగ్గరికి తీసుకుని, అక్కడే మెట్ల మీద కూర్చోగానే పెద్ద పిల్లలిద్దరూ ఆవిడకి చెరో వైపూ చేరిపోతారు. ఇంక ఆవిడ మొదలు పెడుతుంది.. ”నే చచ్చిపొయానే.. నా చిట్టిని వదిలి వెళ్ళానే.. ఎంత ఏడిచెవె నా తల్లీ, నా బుధ్ధి పాడుగాను.. నే చచ్చిపొయానే..” అంటూ పిల్లని ముద్దు పెట్టుకోనూ, పిల్లాణ్ణి దగ్గరికి తీసుకోనూ, తన్ని తిట్టుకోనూ.. తప్పితే అలా కాలవలో చేష్టలు దక్కి నిలబడ్డ ఆయనగారి వేపు చూడనైనా చూడదు. అప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో తల్చుకుంటుంటే ఎంతో నవ్వొస్తుంది.


అన్నీ ఇలాంటి చక్కిలిగింతలు పెట్టించే కథలే .

”మీకూ, మీ భార్యకూ అభిప్రాయభేదాలు రావా? వస్తే పొట్లాటలు లేకుండా ఏవిధంగా జరుపుకొని వస్తున్నారు?” అని నా స్నేహితులైన ఇంద్రగంటివారిని అడిగాను.

ఇలాంటి ప్రశ్నను ఎవరు అడుగుతారో వేరే చెప్పాలా..

హాస్య రచయితలలో అగ్రగణ్యుడుగా ప్రసిధ్ధి చెందిన శ్రీ మునిమాణిక్యం నరసింహారావుగారు.
మునిమాణిక్యంగారి దాంపత్యోపనిషత్తు పుస్తకం లోని మొట్టమొదటి వాక్యం అది.

ఆ పుస్తకం లో ముందుమాటగా ఆయన ఒకమాట చెపుతారు.

హరిణీ ప్రేక్షణా యత్ర గృహిణీ న విలోక్యతే
సేవితం సర్వసంపద్భి రపి తద్భవనం వనమ్.

ఏ భవనములో కురంగీనయన అయిన గృహిణి కనబడదో, ఆ భవనము సకల సంపత్తులతో కూడుకొన్నప్పటికీ వనమే అవుతున్నది కాని భవనము కావడము లేదు. గృహానికి గృహలక్ష్మి ఉండాలె అన్నాడు పండితరాజు.

దాంపత్య జీవితాన్ని రమ్యంగా చిత్రించాలని ఆయన అభిలాష.

మునిమాణిక్యంగారు ”దాంపత్యోపనిషత్తు” వ్రాయాలనుకున్నప్పుడు చాలామంది పెద్దవారిని భార్యాభర్తల మధ్య అభిప్రాయభేదాల గురించి అడిగారు. అదిగో అప్పుడు అడిగిందే పైన చెప్పిన ప్రశ్న.

”మీకూ, మీ భార్యకూ అభిప్రాయభేదాలు రావా? వస్తే పోట్లాటలు లేకుండా ఏ విధంగా జరుపుకొని వస్తున్నారు!” అని నా స్నేహితులైన ఇంద్రగంటివారిని అడిగాను. ఆయన మంచి పండితుడు, సాహితీపరుడు, మనస్తత్వ శాస్త్రము బాగా తెలిసినవాడు. ఆయన చెప్పింది యిది:

”నాకూ, నా భార్యకూ అభిప్రాయభేదాలు రాకుండా ఉండవు. వస్తూనే ఉంటవి. ఆవిడ అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయం కలిగి వున్నప్పుడే మేము భిన్నాభిప్రాయులము అవుతాము. భిన్న తత్వాలు గల అభిమతాలకు సంఘర్షణ ఏర్పడి తగవుగా పరిణమిస్తుంది. కాబట్టి అభిప్రాయభేదం వచ్చినపుడు నా అభిప్రాయం నేను ఆవిడతో చస్తే చెప్పను. ఇంక ఆవిడ ఏం జేస్తుంది? నోరు మూసుకుని ఊరుకొంటుంది. ఇదే నేను అవలంబిస్తూ ఉన్న మార్గం పోట్లాటలు లేకుండా ఉండడానికి.” అన్నారు.”అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు నేనే నోరుమూసుకొని ఊరుకుంటాను” అని చాలా చమత్కారంగా చెప్పినారు గదా అని సంతోషించాను.ఆ తరువాత కాటూరివారిని అడిగాను.. ఇలా మునిమాణిక్యంగారు ఈ ప్రశ్న చాలా పెద్ద పెద్దవారిని అడిగి సమాధానాలు రాబట్టుకొని మరీ ఈ పుస్తకం వ్రాసారు.


” జీవిత రమణీయకము మహారాజుల ఉన్నత సౌధాలలోనూ, ఉద్యానవనాలలోనూ మాత్రమే కాక రసవిహీన మనుకొన్న సామాన్య గృహస్థజీవితంలో కూడా ఉన్నదని చూపడానికి నేను నా జీవితం అంతా ప్రయత్నించాను.
ఈ పుస్తకం కూడా అట్టి ప్రయత్నానికి ఫలితమే! సంసారపు పాలకడలిని చిలకడములో చిందిన తుంపురులను పోగుచేయగా ఈ గ్రంథము తయారు అయింది.”

అని ఆయన ఈ ”దాంపత్యోపనిషత్తు” పుస్తకానికి ముందు మాటలో చెప్పారు.

ఈ పుస్తకాన్ని ఎల్లాగ చదవాలె అన్న విషయాన్ని గురించి రెండు మాటలు (ఆయనవే)
‘’ ఇది హాస్యగ్రంథము. ఆ విషయము గుర్తించి చదవండి. అంటే కాసేపు నవ్వుకొనడానికి సిధ్ధపడి మరీ పుస్తకం తెరవండి. విసుగుగా ఉన్నపుడు ఈ పుస్తకం చదవకండి. ‘’ అని..

సంసార సాగరంలొ దొరికే సున్నితమైన హాస్యం కావాలంటే మాత్రం మనం మునిమాణిక్యం గారి కాంతాన్ని కలుసుకోవాల్సిందే...


**************************************************************************************

Posted by జ్యోతి Nov 9, 2009 12 people say 'Hello!'

జెనీవాలో ఉన్న సృజన పంపిన అందమైన దృశ్యకావ్యం.


ఇప్పటికి నేను మొత్తం Switzerland కి ఐదు సార్లొచ్చాను. అప్పటి నుండి ఇప్పటి వరకూ తీసిన ఫోటోలూ, చూసిన ప్రదేశాలకు సంబంధించి, సేకరించిన , అందుకున్న (మిత్రులిచ్చినవి) పిక్చర్స్ లో కొన్ని మన B&G కోసం. ఆ మొదటి రోలెక్స్ వాచ్ RB చూపిస్తే కళ్ళు చెదిరిపోయాయంటే నమ్మండి. నా జెనీవిహారానికి సంబంధించిన కొన్ని మధుర ఙ్ఞాపకాలు చూడండి.


ధన్యవాదాలతో,
సృజన రామానుజన్


జెనీవా ఇలా ఉంటుందా? అనిపించింది. చదువుకునే రోజుల్లో వెళ్ళినప్పుడు చూసిన అనుభూతి, ఆ ఆశ్చర్యం ఇంకా అలాగే...


రోలెక్స్ లేడీ. జింక వేటకి సింహం వెళ్ళేటప్పుడు రోలెక్స్ పెట్టుకుంటే ఆ రాజసమే వేరని...



King of the watches Rolex




నాకు స్కీయింగ్ ఇష్టం. కొన్ని సార్లు ట్రై చేశాను కూడా. ఇది నా ఫ్రెండ్ రోజర్ బారింగ్టన్ ఇచ్చిన పిక్చర్.


జెనీవా యూనివర్సిటీ. ఆ సౌందర్యానికి గులాం కావాల్సిందే.



ఒక పార్కులో సుందర దృశ్యం. ఒక పుస్తకంలో చూసి నేను ట్రై చేశాను అదే మాదిరి. ఎలా ఉందో?



జీవితంలో ఒకసారైనా ఫ్లోరెన్స్ చూడాలంటారు. ఈ చిత్రం చూస్తే అలానే అనిపిస్తోంది కదూ? నేను తీసింది కాదులెండి. RB గారిచ్చిన పిచ్. బ్లూటూత్ హిహిహి




ఫౌన్టెన్ ఆఫ్ యూత్. జెనీవా. ప్రఖ్యాతి గాంచింది.



అత్యద్భుతమైన సరస్సు. పిక్చర్ నాది కాదు. RB గారిచ్చింది. కాకపోతే ఆ ప్రదేశాన్ని చూశాను.


జెనీవా వంతెన




International monument to the protestant monument



జెనీవా ద్వీపం. Very high definition Digicam తో తీసిన పిక్చర్.
నేను తీసిందైతే కాదు. కానీ ఇక్కడి విహారం మాత్రం అద్భుతమైన అనుభూతినిస్తుంది.


నా బ్లాక్ బెరీలో ఫౌంటైన్ ఆఫ్ యూత్




ఫౌంటైన్ ఆఫ్ యూత్.

Posted by జ్యోతి Nov 4, 2009 13 people say 'Hello!'

Books and Galfriends కి ఒక అద్భుతమైన collection దొరికింది.ఇంట్లో వెతుకుతుంటే ఒక పాత పేపర్ల ప్రతి దొరికింది. అందులోని విషయమే ఈ శీర్షిక. విలువైన శ్లోకాలున్నాయందులో.

వ్రాసింది శ్రీమాన్ ఎస్టీజీ వరదాచార్యులు గారు (నా దగ్గరున్న ప్రాథమిక సమాచారం మేరకు). అన్నీ శ్లోకాలే ఉన్నాయి. నాన్నా, నేనూ దాన్ని అనువదించే పనిలో పడ్డాము. పెద్ద hand నాన్నదే అనుకోండి. ఆ అనువాదం అంతా వ్యాఖ్యానంతో సహా అందించాలనే ప్రయత్నం. నిన్నా, ఇవాళా కాస్త వళ్ళు నల్తగా ఉంది. ఇప్పుడీ ఉత్సాహంలో ఒక చిన్న ప్రకటనేద్దామని వచ్చా.

ఆయన మా నాన్న గారికి ఎప్పుడో ఇచ్చిన చేతివ్రాత ప్రతి ఇది. మరింకేం? వచ్చే సోమ వారం మొత్తం మూడు టపాలు. ఇదీ, కృష్ణరాయ వైభవం, మరియూ ఒక చక్కని పుస్తక పరిచయం.

మచ్చుకు ఇప్పటికైన శ్లోకానువాదం చూడండి...

కుర్వాణ మేకం సరసం చ కావ్యం 
స్రష్టార మాహు ర్విభుదా కవీంద్రమ్|
అనన్త రూపం చ విచిత్ర మేతత్
జగత్ సృజంతం క ఇతీడ్మహేత్వాం. ||

లోకంలో సరసమైన కావ్యమొక దానిని రచియించిన వానిని స్రష్ట యని కొనియాడుచుంటిరి. ఓ భగవంతుడా! అంతు లేని రూపములలో ఆశ్చర్యము గొల్పు విశ్వమును సృజించు నిన్నేమని కొనియాడెదము?

అదండి సంగతి. కాస్త వళ్ళు తెరిపిన పడగానే మిగతా అంతా అందించే ప్రయత్నం చేస్తాను, పుస్తకం గురించిన మరింత సమాచారం తెలిసిన వారెవరైనా ఉంటే ఇక్కడ పంచుకోండి. నా సేకరణా పనులూ నేను మొదలెట్టాను.

వీలును బట్టీ బుధ వారం ఆచార్యుల వారి గురించి ఇస్తాను. వారి అసలు అనువాదమే దొరికితే ఇంకా మంచిది కదా? :-) ఇప్పటికైతే ఉంది చేతి వ్రాత ప్రతే. స్కానబుల్ గా లేదసలు. అంత ఖర్చు పెట్టాలేను.

Posted by గీతాచార్య Nov 2, 2009 1 people say 'Hello!'




రాజగోపాలాచార్యులు గారు సంస్కృతాంధ్ర పండితులు. ఇక ముందు ప్రతి సోమ వారము (వీలున్నంతలో. నెలకు రెండు తగ్గకుండా) వైభవము అనే శీర్షికన రాయల వారి కాలం నాటి కవితా వైభవమును అందిస్తారు.
*** *** ***

తెలుగు సాహితీ చరిత్ర యందు సర్ణ యుగముగ భాసిల్లెడి కాలము కృష్ణరాయల పరిపాలన. సాహితీ సమరాంగణ సార్వభౌమ! అను బిరుదమును కలిగిన ఈతడు క్రీ.శ. 1509 నుండీ క్రీ.శ. 1529 వరకు గల ఇరుబదేండ్లు మాత్రమె పరిపాలించినను, తన సుపరిపాలన ద్వారా, కళాపోషన ద్వారా, ఎంతో ఖ్యాతి గడించినారు.



తన సంస్థానమున భువన విజయమను సాహిత్య గోష్టినేర్పరచి, వివిధ భాషా కవి పండితులను గౌరవాదరములతో సత్కరించినాడు. అందు అష్ట దిగ్గజములనెడి ఎనమండగురు కవి పుంగవులను గూర్చి ఈ వ్యాస పరంపర యందు పరిశీలించుదాము.

౧. అల్లసాని పెద్దన... అల్లిక జిగి బిగి అని పేరు. ఆంధ్ర కవితా పితామహుడు, మను చరిత్ర అను ప్రబంధ సృష్టి కర్త. వీరి పాండిత్యమును మెచ్చి రాయల వారే స్వయముగ గండపెండేరము నందించినారు.

౨. నంది తిమ్మన... ముక్కు తిమ్మన యను మరొక నామధేయమును కలిగిన ఈయన వాణీ విలాసము, పారిజాతాపహరణమను కావ్యములనందించినారు. సరళమైన భాషకు పెట్టింది పేరు.

౩. రామరాజ భూషణ... పెద్దన మును చరిత్రమునకు దీటుగ వసు చరిత్రమను ప్రబంధమును సృజియించినారు. "శ్లేష కవితా చక్రవర్తి" అని బిరుదము కలదు. కావ్యాలంకార సంగ్రహము, హరిశ్చంద్ర నలోపాఖ్యానమను ద్వ్యర్థి (ద్వయర్థి) కావ్యమును రచియించిన వీరి అసలు పేరు భట్టు మూర్తి.

౪. అయ్యలరాజు రామభద్రుడు... ఆంధ్రదేశమందలి కడప యందు జన్మించిన (పెక్కు మంది భావన) వీరు రామాభ్యుదయమను కావ్యమును రచియించినారు.

౫. మాదయ గారి మల్లన... రాజశేఖర చరిత్రము వీరి రచన. రాయల వారు దండయాత్రా సమయములయందు ఈయన వెంట ఉండెడి వారని ప్రతీతి.

౬. ధూర్జటి... శ్రీకాళహస్తీశ్వర శతకమును, శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యమును రచియించిన వీరు రాయల వారి దిగ్గజములయందు భిన్నమయిన వ్యక్తిత్వము కలవారు.

౭. పింగళి సూరన... ఆంగ్లమున జెప్పవలెనన్న... ఈయన one of the rarest original story teller of that time. కళాపూర్ణోదయము అను కావ్యము (ఆంగ్లమున The sound of the kiss) చిత్ర విచిత్రమైన కథా గమనముతో నుండును. ప్రభావతీ ప్రద్యుమ్నము వీరి మరొక రచన కాగా, రాఘవపాండవీయమను ద్వ్యర్థి (ద్వయర్థి) కావ్యమును కూడ వ్రాసినారు. Two of his works were revolutionary in Telugu and the first of their kind. Kalapurnodayam is more of a novel than poetry and Raghava Pandaveeyam is in dvayarthi style. (ఈ మాటలు వికీ యందలివి).



౮. తెనాలి రామకృష్ణుడు... తెనాలి రామలింగడనెడి పూర్వ నామము కలిగిన ఈతను సుప్రసిద్ధుడు, అనేక ఊహా కథల యందు పాత్రధారి. వికటకవి యైన ఈయన పాండు రంగ మహాత్మ్యమును, ఉద్భటారాథ్య చరిత్రముని రచియించటయే కాక, అనేక ప్రసిద్ధములయిన పద్యములను చెప్పెనని పేరు. ఘటికాచల మహాత్మ్యమను వేరొక కావ్యమును రచియించెను. పాండు రంగ మహాత్మ్యమును పంచ కావ్యములందునొకటిగ పేర్కొందురు.


ఇట్టి అష్ట దిగ్గజములకు దీటుగ రాయల వారు ఆముక్త మాల్యద యను గోదా చరిత్రమును రచియించెను.

విశిష్టాద్వైతమును స్వీకరించినను సర్వులను సమముగ ఆదరించిన రాయల వారి కాలమందలి కవితా వైభవమును గూర్చి వరుసగ తెలుసుకొందుము.
*** *** ***

We thank Rajagopalacharyulu garu for providing us with an insightful information about the Ashta diggajas.

గమనిక: గీతాచార్య టైప్ చేయవలసిన టపా ఇది. అందుబాటులో లేక పోవటం వల్ల ఆ బాధ్యత నా మీద పడింది. పొరబటులన్నీ నావే అనిన్నీ, వ్యాసమిచ్చిన ఆచార్యుల వారివి కాదనిన్నీ నా మనవి. వేగంగా dictate చెయ్యటంలో కొన్ని పొరబాట్లు దొర్లి ఉంటే క్షంతవ్యురాలను.

చైతన్య కళ్యాణి

Posted by చైతి 9 people say 'Hello!'


"కమీషనర్లు వస్తారు పోతారు. చంటి గాడు  లోకల్. ఇక్కడే ఉంటాడు."

కానీ మన క్రికెట్ చంటిగాడు గ్లోబల్. వికెట్ ఏదైనా సరే, బౌలర్ ఎవడైనా సరే, (జట్టు)పొజిషన్ ఎలా ఉన్నా సరే, "సిట్యుయేషన్ ఎలా ఉందని కాదన్నాయ్యా! రన్స్ కొట్టామా లేదా" అదే సూత్రం.


వందేసేలోపల కనీసం ఇరవై బంతులు మ్రింగే batsmen చాలా మంది. ఇక batting తాపీ ధర్మారావుల సంగతి సరే సరి!మరాంటిది మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో 2003 December 26 న ఆడిన విధ్వమ్సకరమైన ఇన్నింగ్స్ చిరస్మరణీయమైంది. కానీ అతని ఆటకే కాదు. 195 దగ్గర సిక్స్ కి ప్రయత్నించి ఔటైన విధానానికి, అక్కడి నుంచీ ఇండియా 3/311 నుంచీ 366 కి ఆలౌటై చివరికి మ్యాచ్ ని తొమ్మిది వికెట్ల తేడాతో కోల్పోయినందుకు. అదే వేరే ఆటగాడైతే ఆ పాటికి తన ఆటలో మార్పునో సంయమనాన్నో అలవర్చుకునే ప్రయత్నం చేస్తాడు. 


రెండు మ్యాచుల తరువాత... 295 పరుగులు. ఆ 195 ని గుర్తుంచుకున్న batsman అవడూ మళ్ళా కల్లో కూడా సాహసించని షాట్. Sixer. Only player in the world to get his triple with a sixer. I hope only player on Earth to think of that shot. 


ఈపాటికే అర్థమయ్యుంటుందందరికీ... 







ఎవడు జస్టలా గంటాడితే పీటర్సన్గాడికి దిమ్మతిరిగి కెప్టెన్సీ పోగొట్టుకున్నాడో ఆడే సెగ్గీ... (Indian) cricket చంటిగాడు. (పీటర్సన్ కెప్టెన్సీ పోవటానికి వేరే కారణాలున్నాయనుకోండీ)

వీరేందర్ సెహ్వాగ్... పేరు చెబితేనే ప్రత్యర్థి బౌలర్లకి ముచ్చెమటలు పోసి ఆ సెగ తగలకుంటే బావుణ్ణని కోరుకుంటారు.

అన్నీ ప్రక్కన పెడితే ప్రపంచ క్రికెట్ లో ఎలాంటి బంతి నైనా బౌండరీకి పంపగలిగిన ఏకైక ఆటగాడు. ఏ సందర్భంలో ఐనా, ఎలాంటి పిచ్ పైనైనా ధాటిగా పరుగులు సాధించగలిగిన ఆటగాడు.


"వంద మంది చాపెళ్ళొస్తారు పోతారు. సెహ్వాగ్ లోకల్. అక్కడే (ఓపెనర్ గా) ఉంటాడు."
*** *** ***

"కమీషనర్ కూతుళ్ళకి పెళ్ళిళ్ళు కావా? కమీషనర్ కూతుళ్ళకి మొగుళ్ళు రారా?"

టెస్టుల్లో ఓపెనర్ అంటే డిఫెన్స్ ఆడుతూ ముందున్న batsmen కి బాట వేసే వాడనే భ్రమని (చూ|| గవాస్కర్, చేతన్ చౌహాన్, Geoff Boycott to our own Akash Chopra, and others) కొద్ది కొద్దిగా ఆస్ట్రేలియన్లు తొలగిస్తే దాన్ని రూపుమాపినవాడు సెహ్వాగ్. "ఏఁ ఓపెనర్లు దూకుడుగా ఆడితే పెద్ద ఇన్నింగ్స్ లు ఆడలేరా? సెంచరీలు రావా?"

ఎందుకు రావూ? బ్రహ్మాండంగా వస్తాయి. అది కూడా ఆషామాషీ సెంచరీలు కాదు. అతి భారీ సెంచరీలు. గత పదకొండు సెంచరీలూ, 150 పై మాటే. అందులోనూ రెండు ట్రిపుళ్ళూ మరో రెండు డబుళ్ళూనూ. పాక్ మీద కొట్టిన ట్రిపుల్ ఒక తరహా ఐతే సౌతాఫ్రికా మీద బాదిన త్రిశతకం మరో తరహా. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనది. ఇందులోనూ 293 దగ్గర సిక్సర్ కొట్టినప్పుడు నేను ఎగిరిన ఎగురుడు ఇంకా మా ఇంట్లో ఫోక్లోర్. వీడి ఆనందం కొయ్యా అని. అంతే కదా మరి. His batting is pure magic. Divine grace. అంటే ఎంత ఆడితే అంత మంచిదని జట్టుకు.

ఈసారిక్కడ సిక్సరంటే చచ్చాడే అని కామెంట్లు. నేను పెట్టిన పందెం కట్టాను. ఖచ్చితంగా 290 దాటాక సిక్స్ కొడతాడాని.

అనిల్ కుంబ్లే దేశానికి చేసిన అతిగొప్ప ఉపకారం బౌలర్ గా వికెట్లు కొట్టి మ్యాచులను గెలిపించటం కాదు. 2007 ఆస్ట్రేలియా సీరీస్ కి సెహ్వాగ్ ని జట్టులోకి తేవటం. లేందే... అప్పటి దేశవాళీ ఫాం, జట్టు పరిస్థితిని బట్టీ అతని రాక అసాధ్యమే.

Form is temporary, class is permanent. ఎక్కువగా వినే మాట. కానీ సెగ్గీదాదా "Defence is temporary. Shot making is permanent" అంటాడు.

He has guts to win glory.

భారత క్రికెట్ కి గంగూలీ ఇచ్చిన వరప్రసాదం సెహ్వాగ్. (జట్టులోకి తెచ్చిందీ, ఓపెనర్ని చేసిందీ). సెహ్వాగ్ ఆటను చాలా సందర్భాల్లో గుర్తుచేసుకోవచ్చు. వాటి గురించి క్రమంగా సరిక్రొత్త కోణంలో తెలుసుకుందాం.

Time Magazine లో సెహాగ్ గురించిన ఆర్టికిల్ చదవాలంటే ఇదిగో లింకు...

Off-side slaughter అంటూ క్రికిన్ఫో లో ఇచ్చిన ఈ వ్యాసాన్ని చూడండి.


బ్లాగ్మిత్రులందరికీ Happy weekend

Posted by గీతాచార్య Nov 1, 2009 8 people say 'Hello!'

Subscribe here

Beautiful lady (Reading a book)

Beautiful lady (Reading a book)
Kira Knightley

Motorcycle Diaries

Motorcycle Diaries
గీతాచార్య & Dhanaraj Manmadha